టూరిజం జాతర.. హైదరాబాద్ టూ ఖమ్మం..భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాలకు స్పెషల్ టూర్

టూరిజం జాతర.. హైదరాబాద్ టూ ఖమ్మం..భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాలకు స్పెషల్ టూర్
  •  హైదరాబాద్​ టూ ఖమ్మం,- భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాలకు...
  • ఆధ్యాత్మికం ప్రకృతి సౌందర్యం ఫారెస్ట్​ గుండా టూరిజం సర్క్యూట్​
  • కిన్నెరసాని ఐల్యాండ్​పై స్పెషల్​ ఫోకస్​
  • ఆర్టిఫిషియల్​ బీచ్​ ఏర్పాటుపై దృష్టి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఫారెస్ట్​_ఐటీడీఏ_టూరిజం శాఖల ఆధ్వర్యంలో స్పెషల్​ టూర్​ సర్క్యూట్​కు ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. హైదరాబాద్​ నుంచి ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పర్యటించి తిరిగి హైదరాబాద్​కు చేరుకునేలా టూర్​ ప్యాకేజీని ఆయా శాఖల ఆఫీసర్లు ప్లాన్​ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఫారెస్టు డిపార్ట్​మెంట్ నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపించారు. జిల్లాలో టూరిజం ప్యాకేజీ డెవలప్​మెంట్​కు సుమారు రూ.39 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ టూర్​ సర్క్యూట్ అమల్లోకి వస్తే ఆయా జిల్లాల్లో టూరిజం మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. టూరిజంతో పాటు కొంత మంది నిరుద్యోగులు, ఆదివాసీలకు ఉపాధి అవకాశాలు లభించేలా అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. 

ఆధ్యాత్మికం, ప్రకృతి సౌందర్యం, ఫారెస్ట్..

హైదరాబాద్‌‌‌‌ నుంచి వచ్చే పర్యాటకులు ముందుగా ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల పార్క్‌‌, ఖిల్లాను సందర్శించేలా ప్యాకేజీని రూపొందిస్తున్నారు. అనంతరం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని పులిగుండాల ప్రాంతాన్ని సందర్శించేలా ప్రణాళిక చేస్తున్నారు. అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుబ్బల మంగమ్మ టెంపుల్, కిన్నెరసాని అందాలు, డీర్‌‌ పార్క్‌‌, ఫారెస్ట్​సఫారీ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్యాకేజీ రూపొందిస్తున్నారు. కిన్నెరసాని ఐలాండ్‌‌లో బస చేసే అవకాశం కూడా కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అనంతరం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, పర్ణశాల, సీతమ్మ నారచీరల ప్రాంతాలను సందర్శించేలా ఆధ్యాత్మిక పర్యటనను ప్యాకేజీలో చేర్చుతున్నారు. అక్కడి నుంచి ములుగు జిల్లాకు చేరుకుని నర్సింహస్వామి టెంపుల్, బొగత జలపాతం, లక్నవరం తీగల వంతెన, రామప్ప టెంపుల్​ సందర్శించిన అనంతరం తిరిగి హైదరాబాద్‌‌ చేరుకునేలా సర్క్యూట్‌‌ను రూపొందిస్తున్నారు. ఒక రోజు, రెండు, మూడు, ఐదు రోజుల ప్యాకేజీలు ప్లాన్​ చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ప్రత్యేక టూర్‌‌ ప్యాకేజీకి కూడా చర్యలు తీసుకుంటున్నారు. 

కిన్నెరసానిలో ఆర్టిఫిషియల్‌‌ బీచ్‌‌..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రాజెక్టు మధ్యలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఐలాండ్‌‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఫారెస్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్లాన్​చేస్తోంది. ఈ ఐలాండ్‌‌లో ఆర్టిఫిషియల్‌‌ బీచ్‌‌ ఏర్పాటు చేసే అంశంపై ఆఫీసర్లు స్పెషల్​ఫోకస్​పెట్టారు. ఐలాండ్‌‌లో రెస్టారెంట్‌‌, బోటింగ్‌‌తో పాటు పర్యాటకులు బస చేసేందుకు అవసరమైన వసతులు కల్పించే అంశంపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. 

పర్యాటకులను ఆకట్టుకునేలా..

రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులను ఆకట్టుకునేలా స్పెషల్‌‌ టూర్‌‌ ప్యాకేజీని రూపొందిస్తున్నాం. టూరిజం, ఐటీడీఏ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ స్పెషల్‌‌ టూర్‌‌ సర్క్యూట్‌‌ రూపకల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే కిన్నెరసానిలోని డీర్‌‌ పార్క్‌‌, ఫారెస్ట్​సఫారీ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి.- భద్రాద్రికొత్తగూడెం డీఎఫ్వో సిద్ధార్థ్​ విక్రం సింగ్